ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్

0
  • రోటీన్‌గా చేసిన పరీక్షల్లో పాజిటివ్‌
  • వైరస్‌ సోకినా లక్షణాలేవీ లేవు
  • ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు
  • ఉపరాష్ట్రపతి భవన్‌ వర్గాల వెల్లడి
  • వైద్యుల సూచనతో హోం ఐసోలేషన్‌
  • సతీమణి ఉషమ్మకు నెగెటివ్‌
  • వెంకయ్యకు ప్రధాని మోదీ ఫోన్‌
  • ఆయన సలహా మేరకు సీటీ స్కాన్‌

న్యూఢిల్లీ : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. మంగళవారం ఉదయం రొటీన్‌గా నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. వెంకయ్యనాయుడు సతీమణి ఉషమ్మకు కరోనా పరీక్ష చేయగా నెగటివ్‌ వచ్చింది. వెంకయ్యకు కరోనా సోకినా లక్షణాలేవీ కనిపించలేదని, ఆయన మంచి ఆరోగ్యంతో ఉన్నారని ఉపరాష్ట్రపతి భవన్‌ వర్గాలు తెలిపాయి. హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా వైద్యులు ఆయనకు సూచించారు. వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలియగానే ప్రధాని మోదీ ఆయనకు ఫోన్‌ చేసి, ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒడిశా డిప్యూటీ స్పీకర్‌తో పాటు 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా

ప్రధాని సలహా మేరకు వెంకయ్యకు సీటీ స్కాన్‌ నిర్వహించగా ఛాతీ, ఊపిరితిత్తులు ఆరోగ్యకరంగా ఉన్నాయని, కరోనా ప్రభావం అత్యంత స్వల్పంగా మాత్రమే ఉన్నట్టు తేలిందని అధికారులు తెలిపారు. ఇటీవల వెంకయ్య రాజ్యసభ సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. రాజ్యసభ సిబ్బందిలో 83 మందికి, ఉపరాష్ట్రపతి కార్యాలయ సిబ్బందిలో 13 మందికి కరోనా సోకింది. నిత్యం వ్యాయామం చేస్తూ, నడకకు ప్రాధాన్యమిచ్చి ఆరోగ్య సూత్రాలు పాటించే వెంకయ్య క్షేమంగా ఉన్నారని అధికారవర్గాలు తెలిపాయి. మంగళవారం సాయంత్రం జరిగిన 14వ ఫిక్కీ హీల్‌ సదస్సు ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన ‘కరోనా అనంతర ప్రపంచం-నూతన ఆరంభం’ అన్న అంశంపై మాట్లాడారు. వెంకయ్య ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదని ఆయన కుమార్తె దీపా వెంకట్‌ తెలిపారు.

Leave A Reply