రామాయణం (సరళ వ్యావహారికంలో)-136 వ భాగము

0

‘‘నీ అనుమానం నిజమే రాకుమారా! నేను రాక్షసకాంతనే! నా పేరు శూర్పణఖ. నీ ముందు మానవకాంతగా నిల్చున్నానంటే… కోరిన రూపాన్ని నేను పొందగలనని నీకు చెప్పడానికే! ఈ అడవి అంతా మాదే! రాక్షసరాజు, మహావీరుడు రావణుని పేరు విని ఉంటావు. ఆయన నాకు పెద్దన్న. మహాపరాక్రమవంతుడు కుంభకర్ణుడు మా రెండవ అన్న. ధర్మాత్ముడు విభీషణుడు మా మూడవ అన్న.’’ అన్నది శూర్పణఖ. రావణుని పేరు వినగానే సీతకి ఎందుకో భయం కలిగింది. రాముని భుజాన్ని గట్టిగా పట్టుకుంది. గమనించాడది లక్ష్మణుడు. శూర్పణఖను కోపంగా చూశాడు.‘‘ఈ ప్రాంతాన్ని జనస్థానం అంటారు. దీని పతి ఖరుడు, అతని తమ్ముడు దూషణుడు కూడా నా సోదరులే!’’ అన్నది శూర్పణఖ. కన్నార్పకుండా జాగ్రత్తగా తననే గమనిస్తున్న రామునితో మళ్ళీ ఇలా అన్నది శూర్పణఖ.‘‘నా బలపరాక్రమాలు చెప్పనలవి కానివి. అలాగే నా సౌందర్యం కూడా. ఇంత వరకూ నేను ఎవరికీ లోబడలేదు. నిన్ను చూశాక, నీ అందం చూశాక నీకు లోబడాలనిపిస్తోంది. నీకు భార్యను కావాలనిపిస్తోంది. రా! నన్ను నీ దాన్ని చేసుకో.’’ చేతులు జాచింది శూర్పణఖ.రాముడు రాలేదు. పైగా అతను నవ్వుతూ సీతను చూడడాన్ని భరించలేకపోయింది శూర్పణఖ.‘‘సుందరాంగా! నీలాంటి సుందరుడికి, ఆ బక్కప్రాణి సీతేం బాగుంటుంది. నీ అందానికీ చందానికీ నేనే తగినదాన్ని, రా! మన మధ్య ఈ సీత ఎందు కంటావా? దీని పీడ వదిలించమంటావా, చెప్పు? ఈ క్షణమే ఈ సీతను మింగి తేనుస్తాను.’’ అన్నది శూర్పణఖ. ఆ మాటకి ఆవేశంగా కదిలిన లక్ష్మణుణ్ణి చూసి, మళ్ళీ ఇలా అన్నది.‘‘ఈ లక్ష్మణుణ్ణి కూడా తినమంటే నీ కోసం కరకరా నమిలేస్తాను.’’కత్తి దూయబోయిన లక్ష్మణుణ్ణి కళ్ళతోనే వారించాడు రాముడు. నవ్వుతూ శూర్పణఖను చూశాడు. పరిహాసంగా అన్నాడిలా.‘‘అగ్నిసాక్షిగా పెళ్ళాడిన సీతను నేను విడువలేను. ఈమెను విడువక నిన్ను అంగీకరిస్తే, సవతిపోరు నువ్వు భరించలేవు. అందుకని…’’‘‘అందుకని?’’‘‘అదిగో! నిన్ను చూసి ఆవేశపడుతున్నాడే లక్ష్మణుడు, అతన్ని కోరుకో! అందగాడే కాదు, చెంతన భార్య లేనివాడు. అంగీకరిస్తాడేమో అర్థించు.’’ అన్నాడు రాముడు.

విరహంతో వేగిపోతోంది శూర్పణఖ. మంచి చెడులూ, అర్థా నర్థాలూ ఏవీ బుర్రకెక్కడం లేదామెకు. రాముడు ఎగతాళిని నిజం అనుకుంది. లక్ష్మణుణ్ణి సమీపించింది. కళ్ళ నిండుగా చూసిందతన్ని. బాగున్నాడు. బంగారురంగులో మెరిసిపోతున్నాడని మురిసిపోయింది.‘‘మనోహరా! నీ అన్న నన్ను కాదన్నాడు, నువ్వయినా నన్ను కనికరించు. భార్యగా అంగీకరించు. వనాల్లో విహరిద్దాం. కొండల్లో కులుకుదాం. గుహల్లో గుసగుసలాడుదాం.’’ అంది శూర్పణఖ.నవ్వాడు లక్ష్మణుడు.అన్న పరిహాసబాణాన్ని అన్న మీదికే ప్రయోగించాడతను.‘‘శూర్పణఖా! నిన్నూ, నీ అమాయకత్వాన్నీ చూస్తోంటే నాకు జాలేస్తోంది. నేను బానిసను, మా అన్నా వదినలను సేవించడానికే నేనిక్కడకు వచ్చాను. నన్ను కట్టుకుని, వారికి నువ్వు మరో బానిసవుతావా? వద్దు. రాక్షసరాజు సోదరికి బానిసత్వమా? భరించరానిది. వెళ్ళు, వెళ్ళి, అన్న రాముణ్ణే అర్థించు. కరుణించమని కాళ్ళా వేళ్ళా పడు! నీ అదృష్టాన్ని పరీక్షించుకో.’’ అన్నాడు.లక్ష్మణుని మాటలు నిజమనుకున్నది శూర్పణఖ.

పరుగున రాముణ్ణి సమీపించింది. కోరిగ్గా చూసిందతన్ని. తర్వాత అతని పక్కగా ఉన్న సీతను కోపంగా చూసింది.‘‘రామా! మన ప్రేమకు ఈ సీతే అడ్డంకి అనిపిస్తోంది. దీన్ని చూసుకునే నువ్వు నన్ను కాదంటున్నావు. దీన్ని బతకనివ్వను. మింగేస్తాను.’’ అంది శూర్పణఖ. భీకరరూపం దాల్చింది. సీతను గుప్పెట అందుకోబోయింది. సీత మీదకు వచ్చిన శూర్పణఖ చేతిని విసిరికొట్టాడు రాముడు.గట్టిగా అరిచి ఆ రాక్షసిని నిలువరించాడు. బెబ్బులిలా అరిచిన రాముని అరుపునకూ, శూర్పణఖ భీకరరూపానికీ సీత భయపడింది. మూర్ఛపోయింది.‘‘సీతా’’ ఆందోళన చెందాడు రాముడు. వెంటనే లక్ష్మణునితో అన్నాడిలా. ‘‘ఈ రాక్షసితో పరిహాసాలు ఆడడం మనదే తప్పు. ఈ నీచురాలిని శిక్షించక తప్పదు. ఈ కామినిని కురూపిని చేసి, బుద్ధి కలిగి బతికేట్టుగా చూడు.’’ ఆజ్ఞాపించాడు రాముడు.అన్న ఆజ్ఞను వెంటనే పాటించాడు లక్ష్మణుడు. శూర్పణఖ జుత్తు పట్టుకున్నాడు. కత్తి దూసి, ఆమె ముక్కు చెవులు కోశాడు. కొండను ఎత్తినట్టుగా శూర్పణఖను రెండు చేతుల్తో పైకెత్తి, అక్కణ్ణుంచి ఆ రాక్షసిని లోయలోకి విసిరేశాడు.

Leave A Reply