రామాయణం (సరళ వ్యావహారికంలో)-135 వ భాగము

0

ఆనందించారు. లక్ష్మణుణ్ణి మెచ్చుకోలుగా చూశాడు రాముడు.‘‘బాగుంది లక్ష్మణా! కుటీరాన్ని చాలా అద్భు తంగా నిర్మించావు. కృతజ్ఞతలు నీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు.’’ అన్నాడు.‘‘మరిదిగారికి చాలా విద్యలు తెలుసు’’ అన్నది సీత. భర్త మాటను వక్కాణించింది.‘‘లక్ష్మణా’’ అంటూ చేతులు జాచాడు రాముడు. దగ్గరగా వచ్చిన అతన్ని కృతజ్ఞతగా గట్టిగా కౌగిలించుకున్నాడు.రోజులు గడుస్తున్నాయి.చలికాలం ప్రారంభమైంది.ఒక రోజున వేకువజామునే సీతారామలక్ష్మణులు ముగ్గురూ గోదావరీ స్నానానికి బయల్దేరారు. ప్రకృతిని చూస్తూ పరవశించిపోతోంది సీతాదేవి. చలికి వణికిపోతున్నాడు లక్ష్మణుడు. వణికిపోతున్న లక్ష్మణుణ్ణి దగ్గరగా తీసుకున్నాడు రాముడు. కౌగిలిలో బిగించి నడిపించసాగా డతన్ని.‘‘ఈ చలికాలాన్ని భరతుడు తట్టుకోవడం కష్టమే! నారచీరెలూ, జటలూ ధరించి మనలాగే ఈ సమయంలో సరయూనదికి స్నానానికి బయల్దేరి ఉంటాడు.’’ అన్నాడు లక్ష్మణుడు.‘‘పాపం’’ జాలి చెందాడు రాముడు.

‘‘రాజ్యసుఖాలను కాదని నీ రాకకోసం చూస్తున్నాడు. కుమారునికి తల్లిపోలిక, కుమార్తెకు తండ్రి పోలిక వస్తే బాగుణ్ణంటారు. అదృ ష్టమో, దురదృష్టమో భరతునికి తండ్రిపోలిక వచ్చింది.’’ నవ్వాడు లక్ష్మణుడు.‘‘భర్తేమో ధర్మపరాయణుడు, కొడుకేమో సుగుణభూషణుడు, కైకమ్మ మాత్రం కఠినురాలు. ఇదెలా సాధ్యం?’’ అడిగాడు.పిన్నమ్మను నిందించినట్టు అనిపించడంతో లక్ష్మణుణ్ణి గంభీరంగా చూశాడు రాముడు. అన్నాడిలా.‘‘భరతుని గురించి ఎంత సేపైనా మాట్లాడు, వింటాను, ఆనందిస్తాను. పిన్నమ్మను నిందించకు. బాధగా ఉంటుంది.’’‘‘అన్నా’’‘‘మాటకు కట్టుబడి వనవాసం చేస్తున్నానేగాని, కాళ్ళమీద పడి, కన్నీరు పెట్టుకున్న భరతుణ్ణి కాదన్నానన్న బాధ నన్ను నిరంతరం సలుపుతోందయ్యా! తట్టుకోలేకపోతున్నాను.’’ రాముడి గొంతు బొంగురుపోయింది.‘‘అన్నా’’‘‘మనం నలుగురం అన్నదమ్ములం, జానకీ కూర్చుని సరదాగా కబుర్లాడుకునే రోజు ఎప్పు డొస్తుందో ఏమో.’’ అన్నాడు రాముడు. లక్ష్మణుని భుజం మీది నుంచి చేతిని తొలగించి, చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకున్నాడు. అన్నను గమనించి, మళ్ళీ ఆ విషయాన్ని ప్రస్తావించలేదు లక్ష్మణుడు.ముగ్గురూ గోదావరిలో స్నానాలు ముగించారు. తిరిగి ఆశ్రమానికి చేరుకున్నారు. ఉబుసుపోక మహర్షుల కథలూ, మహరాజుల త్యాగాలూ రాముడు చెబుతోంటే…సీతాలక్ష్మణులు శ్రద్ధగా వినసాగారు.ఎండ పచ్చగా ఉంది. వెచ్చ వెచ్చగా ఉంది. ఆ పచ్చని వెచ్చని ఎండలో అటూ ఇటూ తిరుగుతూ, ఆ చిగుళ్ళనూ, ఈ పచ్చికనూ మేస్తోంది ఓ జింక. దానిని చూసింది రాక్షసి శూర్పణఖ. పొద్దుటి భోజనం దాంతో సరిపెట్టుకుందామనుకుంది. అందుకోబోయింది. అందక పరుగుదీసింది జింక. వెంటపడింది శూర్పణఖ. పరుగుపరుగున వచ్చి, పర్ణశాలకు చేరుకుంది జింక. రాముని వెనుకగా దాగుంది. తరుముతూ వచ్చిన శూర్పణఖ, అక్కడ ఉన్న సీతారామలక్ష్మణులను చూసింది. చప్పుడు చెయ్యకుండా పొదలమాటుకు తప్పుకుంది. అక్కణ్ణుంచి శ్రీరాముణ్ణే అణువణువూ పరిశీలనగా చూడసాగింది. చెంపకు చారెడు కళ్ళు, విశాలమైన వక్షస్థలం, పొడుగ్గా, బలమైన చేతులు… అబ్బ ఎంతటి అందగాడో అనుకుంది. రాముని సౌందర్యానికి ముగ్ధురాలైంది. మెత్తగా నడిచి, సమీపంలోని సరస్సును చేరింది. అందులో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. పెద్దపెద్దకోరలు, నెత్తినకొమ్ములు, గుండెల మీద కొండల్లా వక్షోజాలు, మొలనూలుగా ఎముకలూ, పుర్రెలూ… బాగాలేను అనుకున్నది శూర్పణఖ. మానవకాంతగా మారింది. సుందరాంగిలా తయారైంది. ప్రతిబింబాన్ని చూసుకుని ఆనందించింది. కులుకుతూ రాముణ్ణి సమీపించింది. అడిగిందిలా.

‘‘మునిలా నారలూ, జటలూ ధరించావు. ఖడ్గచాపాది ఆయుధాలు కలిగి ఉన్నావు. చిన్నదాని సరసన కూర్చున్నావు. ఎవరు నువ్వు?’’సమాధానం చెప్పలేదు రాముడు. శూర్పణఖను నఖశిఖపర్యంతం గమనించాడు.‘‘ఇది భీకరరాక్షసులు సంచరించే అటవీప్రాంతం. ఈ ప్రాంతానికి మీరెందుకు వచ్చారు? రావడానికి కారణం ఏమిటి?’’ అడిగింది శూర్పణఖ.‘‘నా పేరు రాముడు. నేను దశరథమహారాజు పెద్ద కుమారుణ్ణి. ఈమె నా భార్య సీత. ఇతను నా తమ్ముడు లక్ష్మణుడు.’’‘‘వాళ్ళ సంగతి ఎందుకు? నీ సంగతి చెప్పు.’’ నవ్వింది శూర్పణఖ.‘‘నా తండ్రి ఆజ్ఞానుసారం నేను అరణ్యవాసం చేస్తున్నాను. నా సంగతి సరే, నువ్వెవరు? స్త్రీవై ఉండి, ఈ అడవిలో భయం లేకుండా సంచరిస్తున్నావంటే…నువ్వు రాక్షసివి కావుకదా, ఒకవేళ అయితే ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు?’’ అడిగాడు రాముడు.

Leave A Reply