రామాయణం (సరళ వ్యావహారికంలో)-133 వ భాగము

0

‘‘మహారథుడవు, ధర్మమూర్తివి, కీర్తికే కీర్తివి. నీలాంటి వాడు నాకు అతిథి కావడం నా పూర్వజన్మ సుకృతం.’’ అన్నాడు అగస్త్యుడు. రాముడికి సమర్పించేందుకు మణులు పొదిగిన స్వర్ణచాపాన్నీ, అమ్ములపొదుల్నీ, బంగారుపిడిగల ఖడ్గాన్నీ అతని ముందుంచాడు.‘‘తీసుకో రామచంద్రా! ఈ మహాధనుస్సూ, అమ్ములూ విష్ణుదేవునివి. ఈ ఖడ్గం ఇంద్రునిది. అన్నీ స్వీకరించు. స్వీకరించి, పూర్వం ఆదిదేవుడు దుష్ణులను శిక్షించినట్టుగానే నువ్వూ దుష్టులను శిక్షించి, శిష్ట రక్షణకు నడుం కట్టుకో.’’ అన్నాడు అగస్త్యుడు. స్వీకరించిన రాముణ్ణి ఆశీర్వదించాడు.‘‘చిత్రకూటానికి వచ్చావని తెలిసిన దగ్గర నుంచీ, నువ్విక్కడకు తప్పకుండా వస్తావని ఎదురు చూస్తున్నాను. నా చూపు ఫలించింది. నువ్వు వచ్చావు. ఆనందంగా ఉంది.’’ అన్నాడు అగస్త్యుడు. సీతను చూశాడు. నడచి నడచి అలసిపోయిందేమో! రాముణ్ణి ఆనుకుని సీత కళ్ళు మూసుకుంది. నిద్రపోతోంది.‘‘ఎండకన్నెరుని ఈ సుకుమారి, ఈ భీకరారణ్యంలో నీతో సంచరించడం మహా అద్భు తఁవయ్యా! ఈ సుకుమారి కోరిన కోరికలన్నీ నువ్వు తప్పక నెరవేర్చాలి. అది నీ బాధ్యత.’’ అని నవ్వాడు అగస్త్యుడు.తల వంచుకున్నాడు రాముడు.‘‘చంచలత్వం, కరకుదనం లేని గొప్ప ఇల్లాలు నీ భార్య. అరుంధతీ సమానురాలు.’’ మెచ్చుకున్నాడు అగస్త్యుడు.

‘‘అరణ్యవాసం ఆఖరి దశలో ఉన్నారు. అక్కడా ఇక్కడా తిరిగి అలసిపోవడం ఇక అనవసరం. మిగిలిన కాలాన్ని ఇక్కడే…నా దగ్గరే గడపండి. ప్రతి రోజూ మిమ్మల్ని చూసుకునే అవకాశాన్ని కలిగించండి.’’ వేడుకున్నాడు అగస్త్యుడు.సమాధానంగా లక్ష్మణుని చూశాడు రాముడు. తర్వాత అగస్త్యునితో అన్నాడిలా.‘‘మీ అభిమానానికి కృతజ్ఞులం. దండకలోని ఋషుల రక్షణ భారాన్ని స్వీకరించిన మేము, వారి యోగక్షేమాలను తెలుసుకోవాల్సి ఉంది. వారి మధ్యనే గడపాల్సి ఉంది. ఆ కారణంగా ఆ ఋషుల మధ్యనే మేము నివసించాలనుకుంటున్నాం. మీరు మరోలా అనుకోకపోతే మేము కుటీరం నిర్మించుకుని, సుఖంగా గడిపేందుకు తగిన ప్రదేశం చూపించండి, దాన్ని మీ ఆశ్రమంగానే మేము భావిస్తాం.’’ఆలోచనలో పడ్డాడు అగస్త్యుడు. కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి కళ్ళు తెరిచాడు. చెప్పాడిలా.‘‘రామా! ఇక్కడికి రెండు ఆమడల దూరంలో పావన గోదావరీ తీరం ఉంది. ఆ తీరాన రకరకాల పక్షులకూ, సుందరమృగాలకూ పంచవటి నిలయంగా ఉంది. మీ నివాసానికి ఆ పంచవటి శ్రేష్టంగా ఉంటుంది. సీతకి ఆ ప్రదేశం అత్యద్భుతంగా నచ్చుతుంది. ఫల మూలాలకు అక్కడ కొదవలేదు. మీరు అక్కడ ఆశ్రమం నిర్మించుకుని, ఋషులను రక్షించండి.’’‘‘ధన్యులం’’ అన్నాడు రాముడు.‘‘రామా! అదిగో ఆ ఇప్ప తోపుగుండా పోతే అక్కడ నీకు ఓ మర్రిచెట్టు కనిపిస్తుంది. అది దాటితే చెట్లేలేని ఓ మిట్ట ప్రదేశం కనిపిస్తుంది. తర్వాత కొన్ని కొండలు కనిపిస్తాయి. వాటిని దాటితే…అక్కడ ఉన్నదే పంచవటి.’’ అన్నాడు అగస్త్యుడు.‘‘అయితే మరి మాకు శలవు.’’ అన్నాడు రాముడు. నిద్రిస్తున్న సీతను సున్నితంగా తట్టి లేపాడు. కళ్ళు తెరిచి, లేచి నిల్చుందామె.సీతాలక్ష్మణులసహా పంచవటికి బయల్దేరాడు రాముడు.

(రామాయణకాలంలో పితృకార్యాలు, యజ్ఞసమయాల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు మాంసాహారం స్వీకరించేవారట! కాలక్రమంలో అహింసావాదాన్ని ఆశ్రయించి, కొన్ని వర్గాల వారు మాంసాహారాన్ని విసర్జించారని పెద్దలు చెబుతున్నారు.)

Leave A Reply