మహాభారతం (సరళ వ్యావహారికంలో)-99 వ భాగము

0

‘‘ఈ శయ్యకు ఇదే సరయిన తలగడ! నాకు ఇప్పుడు హాయిగా ఉంది’’ అన్నాడు భీష్ముడు. తర్వాత-‘‘ఉత్తరాయన పుణ్యకాలం సమీపించేంత వరకు నేను ఇక్కడే…ఈ శరశయ్య మీదే విశ్రమించాలనుకుంటున్నాను. నాకు రక్షణ కల్పించండి! ప్రాకార ద్వారాలు నిర్మించండి’’ అని అడిగాడు. పితామహుని నోటి వెంట ఆ మాట వెలువడిన క్షణాల్లోనే కురు, పాండవులందరూ అందుకు సిద్ధమయ్యారు. ఇంతలో కొందరు రాజ వైద్యులు శంతనుని సమీపించి శల్య చికిత్సకు అనుమతి కావాలని కోరారు. గాంగేయుడు దానికి అంగీకరించలేదు. పైగా దాహోప శాంతికై శీతల పానీయం కావాలన్నాడు. కౌరవ కుమారులు వెంటనే మధుర జల పాత్రలతో పితామహుని సమీపించగా-‘‘శరశయ్యపై విశ్రమించిన నాకు మీరు తెచ్చిన ఆ మధుర జలాలు సముచితం కావు. పాతాళ గంగే నాకు సరయినది’’ అని అర్జునుని చూసి-‘‘విపరీత దాహంతో పెదవులు ఎండిపోతున్నాయి. ఈ సమయంలో నువ్వు ఒక్కడివే నన్ను ఆదుకోగలవు! ఆలస్యం చేయక నా దాహార్తిని తీర్చు’’ ప్రార్థించాడు భీష్ముడు. అంతే! అర్జునుడు పర్జన్య మంత్రంతో శరాన్నొకటి సంధించి, యావచ్ఛక్తినీ వినియోగించి మహీతలిపై ప్రయోగించాడు. మరుక్షణంలోనే సురభిళ జలధార ధరణి నుండి పైకెగసింది. ఆ జలాన్ని పితామహునికి అందించాడు. ఆ శీతల పానీయంతో పరమ సంతృప్తి చెందిన భీష్ముడు-‘‘సవ్యసాచీ! నువ్వు పూర్వజన్మలో నర మునీంద్రుడవు! ఈ సంగతి నాకు నారద మహర్షి ఎప్పుడో చెప్పాడు. నువ్వు, శ్రీకృష్ణుడు ఒక్కటై విజృంభిస్తే మీకు అసాధ్యం లేదు. ఈ నిజాన్ని నేను దుర్యోధనునికి చాలా సార్లు చెప్పాను. అయినా ఈ దురభిమాని నా మాటలు పట్టించుకోలేదు. ఫలితం…జరగాల్సింది జరుగుతోంది. తను అన్నట్టుగానే భీముడు కురు వంశాన్ని నాశనం చేయక తప్పడు. అది ఎంతో దూరంలో లేదు’’ అన్నాడు. తన మాటలు దుర్యోధనుని నొప్పించాయన్న సంగతి గ్రహించి అతనితో-‘‘దుర్యోధనా! నరనారాయణులైన కృష్ణార్జునులను ఎదిరించి ఎవరూ నిలబడలేరు. ఇప్పటికైనా నా మాట విని, సంగ్రామాన్ని విరమించుకో! ధర్మరాజుకి ఇంద్రప్రస్థం అప్పగించి, మిగిలిన సామ్రాజ్యంతో సంతోషించు! యుద్ధంలో పోయిన వారు పోయారు. మిగిలిన బంధుజనాన్నయినా కాపాడుకో’’ అన్నాడు భీష్ముడు.

అయితే పితామహుని మాటలని కౌరవ-పాండవులు ఇరువురూ పట్టించుకోలేదు. పైగా ఇంకా ఎక్కువ సేపు అక్కడ ఉంటే గాంగేయుని నోటి వెంట లేనిపోనివన్నీ వినాల్సి వస్తుందన్న భయంతో వారు అక్కడ నుంచి నిష్క్రమించారు.రాత్రయింది. భీష్ముని సమీపించాడు కర్ణుడు. అతనికి అంజలి ఘటించి-‘‘కౌరవ కులాలంకార! నా మీది కోపాన్ని విడిచి రణ ప్రస్థానానికి అనుమతించాల్సిందిగా కోరుతున్నాను’’ అన్నాడు. ఆ మాటకి కర్ణుని చూసి, బలాన్నంతా కూడదీసుకున్నట్టుగా చేతులు చాచి అతన్ని కౌగలించుకుని- ‘‘నీ మీద నాకెలాంటి కోపమూ లేదు రాధేయ! కాకపోతే అన్నదమ్ములను విడగొడుతున్నావని, వంశ నాశనాన్ని ప్రోత్సహిస్తున్నావని నీ మీద అలిగానంతే! నన్ను అర్థం చేసుకో’’ అన్నాడు భీష్ముడు.‘‘నీకొక రహస్యం చెబుతున్నాను విను! నువ్వు రాధేయుడవు కావు! సుక్షత్రియుడవు! నువ్వు కుంతి కుమారుడవు! ఈ రహస్యం నాకు కృష్ణద్వైపాయన మునీశ్వరులు చెప్పారు. పాండు కుమారుడవు అన్న పరమాదరమేకాని, నువ్వంటే నాకెప్పుడూ కోపం లేదు కర్ణా! కోపం లేదు’’ అన్నాడు మళ్ళీ.‘‘నా పరాజయంతో ఈ యుద్ధం సమసిపోతుందని నేనాశిస్తున్నాను. అందుకే నేలకొరిగిపోయాను. నువ్వు యుద్ధంలో ప్రవేశించి ఈ అగ్నిలో ఆజ్యం పొయ్యకు! నరుడు అర్జునుడు, నారాయణుడు శ్రీకృష్ణునీ ఎదురించడం నీ వల్లకాదు! అది గుర్తు పెట్టుకో! చెప్పినవన్నీ చెవిన పెట్టుకుని, అన్నదమ్ములయిన పాండవుల పక్షం చేరి అన్యోన్యతతో మసలుకో! ఆనందిస్తాను’’ అన్నాడు భీష్ముడు. ఆ మాటలకు సన్నగా నవ్వాడు కర్ణుడు.

Leave A Reply