మహాభారతం (సరళ వ్యావహారికంలో)-97 వ భాగము

0

‘‘అనాయసంగా సామ్రాజ్య సంపత్తి చేకూర్చగల సులభోపాయం సెలవివ్వండి’’ అర్ధించారు పాండవులు.‘‘నన్ను ఓడించడమే’’ నవ్వాడు భీష్ముడు.‘‘అదెలా సాధ్యం? అనువైన ఉపాయాన్ని చెప్పండి’’ అడిగారు పాండవులు.‘‘ధర్మాన్ని రక్షించాల్సిన వారు! పైగా మనుమలు! మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను. ఓడించడమంటే నన్ను నిర్జించడమే! అదెలా సాధ్యమంటే…నేను ఆయుధకేళి విరమించాలి. విరమించాలంటే…కవచాన్ని విసర్జించిన వారితోను, శరణ న్నవారితోను, భీరువులు, అంగనలతోను నేను యుద్ధం చెయ్యను. వారు నాతో యుద్ధానికి వస్తే నేను ఆయుధాలు విసర్జిస్తాను’’ అన్నాడు భీష్ముడు.‘‘ఇంకొక శపథం కూడా నాకుంది. అదేమిటంటే…స్త్రీగా పుట్టి, మధ్యలో దైవ బలిమితో మగవారై యోధులైన వారితో కూడా నేను యుద్ధం చెయ్యను! వారితో ఉత్తర క్షణంలోనే పోరాటాన్ని విరమిస్తాను’’ అన్నాడు మళ్ళీ భీష్ముడు. అలాంటి వారు ఎవరు ఉన్నారు? అన్నట్టుగా ఒకరి ముఖాలొకరు చూసుకోసాగారు పాండుకుమారులు. వారలా ఒకరినొకరు చూసుకోవడాన్ని గమనించి-‘‘నేను చెప్పిన లక్షణాలు గల వ్యక్తి ఉన్నాడు. అతడి పేరు శిఖండి. అతడు ద్రుపదుని కుమారుడు. అంతేకాదు, అతడు పూర్వజన్మలో స్త్రీ. శిఖండి నన్ను ఎదురించనంతనే నేను అస్త్ర సన్యాసం చేస్తాను. అర్జునుడు అతనిని ముందుంచుకుని, నాతో తలపడితే అవలీలగా నన్ను నిర్జించగలడు’’ అని భీష్ముడు తననెలా నిర్జించవచ్చునో వివరంగా తెలియజేశాడు.‘‘శిఖండితో పోరు, నా అస్త్ర సన్యాసం…మీకు ధార్తరాష్ట్రుల మీద విజయాన్ని సునాయసంగా చేకూరుస్తుంది’’ అని పాండు కుమారులను దీవించాడు.

‘‘సెలవు’’ అని ప్రణమిల్లారు పాండునందనలు.‘‘వెళ్ళిరండి’’ అని భీష్ముడు జరగబోయేది తలచుకుంటూ సన్నగా నవ్వుకున్నాడు. మరునాడు పదవ రోజు యుద్ధం ప్రారంభమయింది.-అని ఎందుకో తెలీదు, సంజయుడు యుద్ధ వివరాలను చెప్పడం క్షణకాలం పాటు నిలిపి వేశాడు.‘‘ఆగిపోయావేఁ సంజయా’’ అడిగాడు ధృత రాష్ట్రుడు.‘‘పితామహుని వీడ్కోలు భరించలేకున్నాను’’ అన్నాడు సంజయుడు.‘‘తప్పదు! ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుందిగాని, శిఖండిని ముందుంచుకుని ఆ పాండుతనయులు గాంగేయునితో ఏ రకంగా తలపడిందీ వినాలని ఉంది. ఆలస్యం చేయక వివరించు’’ అడిగాడు ధృతరాష్ట్రుడు. వివరించసాగాడు సంజయుడు.పితామహుడు చెప్పినట్టుగానే శిఖండి వింటి వెనుక భాగంలో తన ధనుస్సును ఉంచి, అర్జునుడు భీష్మునితో యుద్ధం చేయసాగాడు. చిచ్చర పిడుగుల్లాంటి కరకుటమ్ములు అసంఖ్యాకంగా అభివర్షించాడు. అర్జునుని శరాఘాతాలను తట్టుకోలేని భీష్ముడు భూతలి మీదకి ఒరిగి విపరీత వేదనతో నిశ్వసించాడు. ఆ మహానుభావుని శరీరమ్మీద దట్టంగా నాటుకున్న నారాచర శ్రేణులే విశాల శరతల్పమయింది. అతని శరీరం రవంతయినా భూతలి స్పృశించలేదు.‘‘మహా యోధుడు భీష్ముని మరణం దక్షిణాయంలోనా’’ అని ఆకాశంలోని దేవతలంతా తలలు పట్టుకున్నారు.-

Leave A Reply