మహాభారతం (సరళ వ్యావహారికంలో)-128 వ భాగము

0

దుర్యోధనుని బాధ! భయం!!

యుధిష్ఠిరుని యౌవరాజ్య పట్టాభిషేకం, భీమార్జునుల పరాక్రమం, నకుల సహదేవులు మంచి వారన్న ప్రచారాన్ని దుర్యోధనుడు సహించలేకపోయాడు. సహించలేక ఒకనాడు కర్ణ శకుని దుశ్శాసనులను పిలిచి-‘‘పాండవులు వీరాధివీరులు. శూరాగ్రేసరులు. మహోద్ధతులు. అందులో అనుమానం లేదు. అయితే వారు అంతటి వారని తెలిసినప్పటి నుంచీ భయంగా ఉంది. పైగా యౌవరాజ్యాభిషేకం యుధిష్ఠిరునికి జరగడాన్ని తట్టుకోలేకపోతున్నాను. అన్నపానాదులు రుచించడం లేదు. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు’’ అని తన బాధను చెప్పుకున్నాడు దుర్యోధనుడు. తల పట్టుకుని కూలబడిపోయాడు. దుర్యోధనుని ఓదార్చడం తమ వల్ల కాదనుకుని, ఆప్త మంత్రి కణికుణ్ణి అక్కడికి పిలిపించి విషయాన్నంతా వివరించి దుర్యోధనునికి అనుకూలంగా మాట్లాడమన్నాడు శకుని.‘‘ఇలా ప్రవర్తిస్తే ఎలా ప్రభూ! ప్రభువులు తమ లోపాలు ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడాలి. రాజుగారి కోపం, అభిమానం సరయిన సమయంలోనే వ్యక్తం కావాలి. సమయం కోసం వేచి చూస్తూ శత్రువుని భరించాలి. కాలం కలసి వచ్చిందంటే పగవానిని క్షణంలోనే హతమార్చాలి. మాయోపాయం చేతనయినా శత్రువుని నిర్మూలించడమే రాజనీతి’’ అని చెప్పాడు కణికుడు.

మంత్రి మాటల్లో ‘శత్రు నిర్మూలనమే రాజనీతి’ అన్నమాట నచ్చి కొంచెం తెప్పరిల్లాడు దుర్యోధనుడు. తర్వాత కర్ణ శకుని దుశ్శాసనులతో పాండవుల గురించి రకరకాలుగా యోచించి ఆలోచించి ‘తప్పదిక! తండ్రిగారిని కలవాల్సిందే! మనసులో మాట చెప్పాల్సిందే’ అనుకుని ధృతరాష్ట్రుని కలిశాడు దుర్యోధనుడు.‘‘తండ్రీ’’‘‘చెప్పు కుమారా’’‘‘పాండు కుమారుల శౌర్య ప్రతాపాలను సహించలేకపోతున్నాను. భయంగా కూడా ఉంది. అదలా ఉండగా…మీరు యుధిష్ఠిరునికి యౌవరాజ్యాభిషేకం చేసి నన్ను మరింతగా బాధించారు. ఎక్కడ చూసినా అతని ప్రస్తావనే! పౌర జానపద ప్రముఖులంతా ధర్మనందనుడంటే మక్కువతో ప్రవర్తిస్తున్నారు. నా గురించి సరే! మిమ్మల్ని, భీష్మ పితామహులను సైతం ఎవరూ పట్టించుకోవట్లేదు’’ అన్నాడు దుర్యోధనుడు.‘‘మీ అంధత్వ దోషం వల్ల మీకు కౌరవ రాజ్య పరిపాలనా యోగ్యత కలగలేదు! ప్రతిజ్ఞ చేసి భీష్ము పితామహుడు రాజ్యాధికారానికి దూరమయ్యాడు. ఈ రెండింటి వల్ల యౌవరాజ్య పట్టాభిషిక్తుడయిన ధర్మనందనుడికే కౌరవ సామ్రాజ్య పట్టాభిషేకార్హత ఉంది. అంటే కాబోయే చక్రవర్తి యుధిష్ఠిరుడే! అవునా’’ అడిగాడు దుర్యోధనుడు.

సమాధానంగా తల వంచుకున్నాడు ధృతరాష్ట్రుడు.‘‘సహించలేను తండ్రీ సహించలేను! యుధిష్ఠిరునికి సామ్రాజ్య పట్టాభిషేకం జరగడం నేను భరించలేను. ఏదైనా చేసి ఆ పాండవేయులను ఇక్కణ్ణుంచి…ఈ హస్తినాపురం నుంచి తరిమేయండి’’ ప్రార్థించాడు దుర్యోధనుడు.‘‘ధర్మార్థ శాస్త్రాలన్నీ పుక్కిట పట్టాను. మహాబలశాలిని! అయితే మాత్రం అంగవైకల్యం కారణంగా నాకీ కౌరవ సామ్రాజ్య పరిపాలనా యోగ్యత కలగలేదు. అని నేనెప్పుడూ బాధపడ లేదు. అంధుడనయినా తమ్ముడు పాండురాజు నన్నే మహారాజుగా అంగీకరించి గౌరవించడాన్ని ఆనందించాను. అలాంటి పాండురాజు కొడుకు యుధిష్ఠిరుడు. భీమార్జున నకుల సహదేవులు అన్ని విధాలా ధర్మనందనునితో సరితూగ గల ధర్మవర్తునులు. వారిని ఇక్కణ్ణుంచి…ఈ హస్తినాపురం నుంచి తరిమి వేయడమంటే భావ్యం కాదు కుమారా! ఆలోచించు’’ అన్నాడు ధృతరాష్ట్రుడు.‘‘ఆలోచించే…బాగా ఆలోచించే నేనీ నిర్ణయానికి వచ్చాను. మీరు అంధులైన కారణంగా పైతృకమయిన రాజ్యలక్ష్మి మా పినతండ్రి పాండురాజుని వరించింది. వారి పుత్రుడు ధర్మనందనుడు. వారిప్పుడు యౌవరాజ్య పట్టాభిషిక్తులు. రేపు…ఈ రాజ్యానికే రారాజులు. ఈ ప్రకారంగా పాండవ వంశీయులే ఈ ధరా మండలానికి ఉత్తరోత్తరాధికారులు. అవునా’’ గద్దించినట్టుగా అడిగాడు దుర్యోధనుడు. కాదనలేనన్నట్టుగా తలాడించాడు ధృతరాష్ట్రుడు.‘‘రాజ్యార్హత లేనప్పుడు మీ కడుపున పుట్టి ప్రయోజనం ఏమున్నది తండ్రీ! మాకే రాజ్యార్హత లేనప్పుడు ఇక మా పుత్రులకు ఎక్కడిది? రాజ్యార్హత లేని మేము పాండవేయుల కనుసన్నలలో సంచరిస్తూ వారిని కొలిచి జీవించవలసిందే కదా! ఇది నేను భరించలేను. మాకీ దురవస్థ కలగడానికి వీల్లేదు. ఇంతవరకు మీరు చేసింది చాలు! తమ్ముడి కొడుకుల్ని చంకనెత్తుకు తిప్పడాన్ని ఇక ఆపండి’’ గట్టిగా హెచ్చరించాడు దుర్యోధనుడు.

Leave A Reply