మహాభారతం (సరళ వ్యావహారికంలో)-126 వ భాగము

0

కర్ణార్జునుల ద్వంద్వ యుద్థం

కర్ణార్జునుల మధ్యఘోర సంగ్రామం ప్రారంభమయింది. అర్జునుడిపై కర్ణుడు పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. అంతటా చీకటి అలముకుంది. ఆ చీకటిలో అర్జునుడు ఎక్కడ ఉన్నదీ ఎవరికీ కానరాలేదు. అది గ్రహించిన దేవేంద్రుడు, అర్జునుని దేహంపై కాంతిపుంజాన్ని ప్రసరింపజేసి ‘అడుగో అర్జునుడు’ అనిపింపజేశాడు. దేవేంద్రుడు పరోక్షంగా ఎప్పుడయితే యుద్ధంలోకి దిగాడో అప్పుడే సూర్యదేవుడు కూడా యుద్ధంలోకి దిగి, కారు మబ్బులను పటాపంచలు జేసి, వెలుగులీనుతు కర్ణుని వీరత్వాన్ని చాటాడు.కర్ణార్జునుల యుద్ధం పాండవ కౌరవాభిమానులలో భయోద్వేగాలను కలిగించాయి. దుర్యోధనాది ధార్తరాష్ట్ర కుమారులు కర్ణుని సమీపించి అతనిని ప్రోత్సహించగా భీష్మ ద్రోణ కృపాది వీరులు అర్జునుని సమీపించి అతనిని ప్రోత్సహించసాగారు. ద్వంద్వ యుద్ధ ధర్మాలన్నీ తెలిసిన ఏకైక వ్యక్తి కృపాచార్యుడు. ఆయన కర్ణార్జునుల దారుణ సంగ్రామ ధోరణి పరిశీలించి కర్ణునితో-‘‘కర్ణా! అర్జునుడు కౌరవ వంశ వర్ధనుడు. కుంతీ పాండురాజుల తనయుడు. అతనితో నువ్వు ద్వంద్వ యుద్ధం చేయాలనుకుంటే నువ్వు నీ వంశ విఖ్యాతిని, నీ తల్లిదండ్రుల పేర్లను ముందుగా సభాముఖంగా వెల్లడించాలి. తర్వాత అన్ని విధాలుగా తులతూగగలవని అనిపించిన పక్షంలోనే నువ్వు అర్జునునితో పోరాడే అవకాశం ఉంటుంది. లేనిపక్షంలో ఈ ద్వంద్వయుద్ధం ధర్మ విరుద్ధం’’ అన్నాడు.

యుద్ధాన్ని నిలుపుజేశాడు.‘‘చెప్పు! నీ కులము ఏమిటి? నీ తల్లిదండ్రులు ఎవరు’’ రెట్టించాడు కృపాచార్యుడు. చెప్పడానికి ఇష్టపడని కర్ణుడు మౌనం వహించాడు. అతని కళ్ళు చెమ్మగిల్లాయి. అది గ్రహించిన దుర్యోధనుడు, కృపాచార్యునితో-‘‘గురువర్యా! క్షత్రియుడైన అర్జునునితో యుద్ధంలో తలపడడానికి కర్ణునికి అర్హత లేదని మీరు అనుకుంటే…నేనీ క్షణంలోనే కర్ణునికి మీరు కావాలనుకుంటున్న పూజ్యతను కలిగిస్తున్నాను. అంగదేశానికి కర్ణుని రాజుగా ప్రకటిస్తున్నాను. ఇదిగో…ఇప్పుడే పట్టాభిషేక మహోత్సవం జరిపిస్తున్నాను’’ అన్నాడు. అన్నదే తడవు కర్ణుడు కాంచన పీఠంపై సమాసీనుడు అయినాడు. మంత్రవేత్తలు ఆ మహా వీరునికి అంగదేశాభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అందుకు పరమానందభరితుడైన కర్ణుడు-‘‘ చెప్పండి మహీపతి! మహా మహుల సమక్షంలో నన్నీరకంగా గౌరవించి ఆదరించిన మీ ఋణం ఎలా తీర్చుకోగలను? మీ కోసం నేనేం చెయ్యగలను’’ దుర్యోధనుని అడిగాడు.‘‘నీ చెలిమి కంటే నాకింకేమీ అఖ్కర్లేదు మిత్రమా! ఆప్త మిత్రుడవై నన్ను అన్ని వేళలా ఆనందింపజెయ్యి. చాలు’’ అన్నాడు దుర్యోధనుడు. కర్ణుని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. అంతలో అక్కడికి సూతుడు వచ్చాడు. తండ్రి రాకను గమనించి, ఆతను అల్లంత దూరంలో ఉంటుండగానే ఎదురేగి తండ్రి పాదాలకు శిరసు వంచి ప్రణామాలర్పించాడు కర్ణుడు.‘‘ఓహో! నీవు సూతపుత్రుడివా? తెలిసినది! తెలిసినది’’ అని వ్యంగ్యంగా నవ్వి తర్వాత-‘‘సూత పుత్రులు క్షత్రియ పుత్రులతో యుద్ధం చేయరాదు. సూత పుత్రుడివి గనక ఎంచక్కా రథ సారధ్యమే నీకు తగినది. అయినా కనకపు సింహాసనాన శునకాలు కూర్చోవడం బాగుండదు. అందుకని అంగరాజ్యం నీకెందుకు కర్ణా! వద్దు! వదులుకో’’ అన్నాడు భీముడు. అతని మాటలకు ఎక్కడలేని కోపం వచ్చినా ఏం మాట్లాడాలి. ఎలా మాట్లాడాలన్నది తెలియక తల వంచుకుని నిలబడ్డాడు కర్ణుడు.

అలా తలవంచుకుని నిలుచున్న కర్ణుని చూసి ఎగతాళిగా నవ్వుతున్న భీమునితో-‘‘భీమసేనా! నువ్విలా ఎగతాళిగా నవ్వడం, కర్ణుని రెచ్చగొట్టినట్టుగా మాట్లాడడం భావ్యంగా లేదు. ఆవు కడుపున పులి పిల్ల పుట్టదు. అలాగే ఈ మహా వీరుడు కర్ణుడు సూత పుత్రుడు అవడం అసంభవం. అమరోత్పత్తిని, శూరావతరణాన్ని, నదీజన్మలను అవగాహన చేసుకోవడం అసాధ్యం. దధీచి మహర్షి శల్యంలో నుండి వజ్రాయుధం ఆవిర్భవించింది. ఆ సంగతి తెలుసుకదా! మన కృపాచార్యులు రెల్లు గుబురులో నుండి జన్మించారు. ద్రోణాచార్యులు కుంభసంభవులు. ఇన్ని ఎందుకు? మీ జన్మ రహస్యాలు ఏమిటి? ఎవరికి తెలియనివి?

Leave A Reply