మహాభారతం (సరళ వ్యావహారికంలో)-125 వ భాగము

0

‘‘అర్జునా! నువ్వింత వరకు చూపించిన విద్యలు నీకే పరిమితం అనుకుంటున్నావేమో! అవి మాకూ వచ్చు! పెద్దలు అనుమతినిస్తే మేమూ ఈ విద్యలను ప్రదర్శిస్తాం’’ అన్నాడు కర్ణుడు. ఆ మాటలకు అర్జునుడు కోపాన్ని తెచ్చుకుని కర్ణుని కొరకొరా చూశాడు. దుర్యోధనుడయితే ఆనందంగా కర్ణుని చూసి ‘ఆహా! భలే మనిషి’ అనుకున్నాడు. ద్రోణాచార్యుని అనుమతి స్వీకరించి కర్ణుడు అంతకు ముందు అర్జునుడు చూపించిన శస్త్రాస్త్ర విద్యలన్నీ అవలీలగా చేసి చూపించడంతో ధార్తరాష్ట్ర కుమారుల ఆనందానికి అంతులేకుండా పోయింది. దుర్యోధనుడు ఒక్కుదుటన కర్ణుని సమీపించి-‘‘మహాబాహు! నువ్విప్పుడు ఇక్కడికి రావడం మా అదృష్టం! మా అందరికి నువ్వు గర్వ కారణం. ఇక మనం ఇద్దరం మిత్రులం’’ అని చేయి జాచాడు. ఆ చేతిని ఆనందంగా అందుకున్నాడు కర్ణుడు.‘‘కోరుకో! నీకేం కావాలో కోరుకో! ఇస్తున్నాను’’ అన్నాడు దుర్యోధనుడు.‘‘అర్జునునితో ద్వంద్వయుద్ధాన్ని కోరుతున్నాను. అనుమతించండి’’ అన్నాడు కర్ణుడు. ఆ మాటకి దుర్యోధనుడు పరమానందభరితుడై-‘‘చాలు మిత్రమా చాలు! వీనుల విందుగా ఉన్నాయి నీ మాటలు’’ అని కర్ణుని గట్టిగా కౌగలించుకున్నాడు.

దుర్యోధనుడు కర్ణుని అలా కౌగిలించుకోవడం, కర్ణుడు కయ్యానికి కాలు దువ్వుతున్నట్టుగా మాట్లాడడం అర్జునునికి బాగా కోపాన్ని తెప్పించాయి. ఆ కోపంతో-‘‘కర్ణా! ఆహ్వానం లేకుండా ఇక్కడికి రావడమే గాకుండా నోటికొచ్చినట్టు వదరుతున్నావు. ఇందుకు ఫలితం అనుభవిస్తావు. జాగ్రత్త’’ అన్నాడు అర్జునుడు. ఆ హెచ్చరికకు కర్ణుడు ముందు పగలబడి నవ్వాడు. తర్వాత అగ్ని జ్వాలవలే మండిపడుతూ-‘‘అర్జునా! పొల్లు మాటలు వద్దు! చేతనైతే యుద్ధానికి రా! క్షణ కాలంలోనే నిన్ను ముక్కముక్కలు చేస్తాను. ఆహ్వానం లేకపోతేనేం? అస్త్ర విశారదులందరికీ ఈ ప్రాంగణంలో ప్రవేశించే అర్హత ఉంది. లేదనేందుకు నువ్వెవరవు’’ అన్నాడు కర్ణుడు.‘‘నేనెవర్నో చూపిస్తాను! రా యుద్ధానికి’’ అని సన్నద్ధమయ్యాడు అర్జునుడు.‘‘నీదే ఆలస్యం’’ అని కర్ణుడూ యుద్ధానికి సిద్ధమయ్యాడు.

Leave A Reply