మహాభారతం (సరళ వ్యావహారికంలో)-122 వ భాగము

0

ఏకలవ్యుడు

ఏకలవ్యుడు ఆటవిక రాజు హిరణ్యధన్వుని కుమారుడు. అతనికి ద్రోణుడంటే గురుభక్తి ఎక్కువ. విలువిద్య నేర్చుకుంటే ద్రోణాచార్యుని వద్దనే నేర్చుకోవాలన్నది అతని కోరిక. అందుకు అనుగుణంగానే ఒకనాడు ద్రోణుని కలిసి, తన అభీష్టాన్ని విన్నవించుకున్నాడతను. ఆటవిక రాజులకు విలువిద్య నేర్పరాదని ద్రోణుడు ఏనాడో నిర్ణయించుకున్నాడు. ఫలితంగా ఏకలవ్యుని విన్నపాన్ని స్వీకరించలేదతను. అయినా ఏకలవ్యుడు నిరుత్సాహపడలేదు. పైగా-‘‘వస్తాను గురువర్యా’’ అంటూ ద్రోణుని పాదాలకు నమస్కరించి వెనుతిరిగాడు. అడవికి చేరుకుని గురు ముఖంగానే విలువిద్య నేర్చుకోవాలి. అదెలా సాధ్యం? అని ఆలోచించాలోచించి ఆఖరికి ఓ నిర్ణయానికి వచ్చాడు. ద్రోణుని మట్టిబొమ్మగా మలచుకుని ఆ బొమ్మ ముందు ధనుర్విద్య అభ్యసించాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే ఆచార్యుని మట్టిబొమ్మగా మలచుకుని దానిని భక్తి శ్రద్ధలతో పూజించి తర్వాత ఆ బొమ్మ ముందు విలువిద్య అభ్యసించడం ప్రారంభించాడు. ఎండలేదు, వానలేదు, రాత్రిలేదు, పగలు లేదు ఎల్లవేళలా శరసంధానమే లక్ష్యంగా జీవించాడు. కొంత కాలానికి అనన్య సామాన్య శర సంధాన కౌశలాన్ని సాధించాడు. ఇదిలా ఉండగా-ద్రోణాచార్యుని అనుమతి మేరకు ఒకనాడు కౌరవ కుమారులంతా అడవిలో మృగాలను వేటాడుతూ వినోదించసాగారు.

వేట కుక్కలతో యోధులు అనేకులు కౌరవ కుమారులను అనుసరించారు. అడవి అడవంతా డప్పులతో ధనుష్టాంకారాలతో మారు మ్రోగిపోయింది. ఆ శబ్దాలకు బెదరిపోయిన ఓ భటుని కుక్క దారి తప్పి శర ప్రయోగ సాధనలో లీనమై ఉన్న ఏకలవ్యుని సమీపించి అదే పనిగా మొరగసాగింది. అది గమనించిన ఏకలవ్యుడు కుక్క ముఖంపై ఏడు బాణాలను ఒక్కమారుగా ప్రయోగించాడు. అయితే ఆ బాణాలేవీ కుక్కను పెద్దగా గాయపరచలేదు. నుదుటన గుచ్చుకుని నిలిచాయంతే! వాటికి భయపడిన ఆ కుక్క పరుగందుకుని కురు కుమారుల సన్నిధికి చేరింది. తప్పిపోయిన కుక్క తనంతట తానుగా వచ్చి దొరకటంతో ఆనందిస్తూ దాని నుదుటన నిలచిన బాణాలను అరున్జుని సహా అంతా పరిశీలించసాగారు. బాణాలు పెద్దగా గుచ్చుకోలేదు. గాయలు కాలేదు. చర్మాన్ని అంటిపెట్టుకుని నిలిచి ఉన్నాయంతే! ఇది అసాధారణం. ఈ రకంగా బాణ ప్రయోగం చే యగలసమర్థుడు ఎవరై ఉంటారు? అని తర్కించి తర్కించి కుక్కని వెంటబెట్టుకుని వారు ఏకలవ్యుని సమీపించారు.ఏకలవ్యుడు అంతెత్తు మనిషి. దృఢ శరీరుడు. ఆజానుబాహువు. అతని కళ్ళల్లోకి చూడడమే కష్టంగా ఉంది. దాంతో పాండవ ధార్తరాష్ట్రులు తలలు దించుకున్నారు. అర్జునుడయితే మాత్సర్యంతో కుతకుతా ఉడికిపోయాడు. కాస్సేపటికి తేరుకుని-‘‘ఎవరు నువ్వు? ఇంతటి విలువిద్య నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావు’’ ఏకలవ్యుణ్ణి అడిగాడు అర్జునుడు.‘‘నా పేరు ఏకలవ్యుడు. నేను హిరణ్యధన్వుని కుమారుణ్ణి. మా గురువుగారు ద్రోణాచార్యులు. వారి అనుగ్రహంతోనే నేనింతటి విలువిద్యను నేర్చుకున్నాను’’ చెప్పాడు ఏకలవ్యుడు.‘‘మా గురువులు ద్రోణాచార్యులు నీకూ గురువా’’ అని ఆశ్చర్యపడి, ‘పదండి! పదండి! చీకటి పడుతోంది’ అంటూ అన్నదమ్ములతో వెనుతిరిగాడు అర్జునుడు. ఆ రాత్రంతా అర్జునునికి నిద్ర కరవయింది. తెల్లారుతూనే ద్రోణుని ఏకాంతంగా కలసి-

Leave A Reply