మహాభారతం (సరళ వ్యావహారికంలో)-94వ భాగము

0

కృష్ణుని ఆగ్రహావేశం

‘‘యుద్ధాన్ని ముందు ఎవరు ప్రారంభించారు’’ అనడిగి, వళ్ళంతా చెవులు చేసుకున్న ధృత రాష్ట్రునితో-‘‘యుద్ధాన్ని ముందు భీష్మాచార్యుడే ప్రారంభించాడు. ప్రారంభించి, ప్రళయకాల రుద్రుడై పాండవ సేనలో చొరబడి, యథేచ్ఛగా వీర విహారం చేశాడు. ఆ శక్తిశాలి ధాటికి పాండవ సేనలు గుంపులు గుంపులుగా పలాయనం చిత్తగించాయి. యుద్ధభూమిలో ఎక్కడ పడితే అక్కడ కనిపించే తెగి పడిన శిరస్సులు, విరిగిన ధనుస్సులు, శకలాలయిన శకటాలు, పతనమయిన పతాకాలను చూస్తే భీష్మునితోపోరు ప్రాణాంతకమనిపించాయి.అది గమనించాడు అభిమన్యుడు. పాండవ సేనలను చేయెత్తి పిలిచి ‘నేనున్నాను’ అని ధైర్యం పలికి శాంతనవుని మీద శర పరంపర ప్రయోగించాడు. భీష్మాభిమన్యుల యుద్ధం శివ కేశవుల యుద్ధాన్ని తలపించింది. అభిమన్యునితో భీష్ముడు ఇలా ఓ పక్క పోరాడుతుంటే మరో పక్క నుంచి అతని మీదికి సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, కేకేయ రాజులు, విరాట మహారాజు, అతని కొడుకు ఉత్తర కుమారుడు ఒక్కుమ్మడిగా దాడి ప్రారంభించారు. అది చూసి శల్యుడు, ఉత్తరుడి పైకి శక్తిని ప్రయోగించాడు. ఆ శక్తికి ఉత్తర కుమారుడు వీర స్వర్గాన్ని అలంకరించాడు. భీష్ముని తొలిరోజు యుద్ధం అలా ముగిసింది’’ అని చెప్పి ఆగాడు సంజయుడు.

‘‘ఉత్తర కుమారుడు చనిపోయాడు! బాగుంది! తర్వాత’’ అనడిగాడు ధృతరాష్ట్రుడు. యుద్ధంలో పాండవుల పక్షానికి చెందిన ఉత్తర కుమారుడు మరణించడం ధృతరాష్ట్రునికి ఆనందంగా ఉంది.‘‘రెండో రోజు యుద్ధం ప్రారంభమయింది’’ చెప్పసాగాడు సంజయుడు.‘‘ ఆ యుద్ధంలో కళింగపతి సహోదరుడు భానుమంతుణ్ణి భీముడు సంహరించాడు.తరువాత మూడో రోజు యుద్ధం ప్రారంభమయింది. ఆ రోజు యుద్ధంలో కౌరవ సేనలను ఒక చోటికి చేర్చి భీష్ముడు గరుడవ్యూహం రూపొందించాడు. రూపొందించి ఆ వ్యూహానికి అగ్రభాగంలో ఉక్కు ముక్కులా నిలిచాడు. అలా నిలిచిన భీష్ముని అర్జునుడు ఎదుర్కొన్నాడు. కిరీటి శర ప్రయోగ చాతురిని లోలోపల మెచ్చుకుని గాంగేయుడు అర్జునునితో తలపడ్డాడు. భీష్ముని శర పరంపర నరనారాయణులిద్దరినీ బాధించాయి. గాంగేయుడు కృష్ణార్జునులపై చిచ్చర పిడుగుల్లా బాణాలు అభివర్షిస్తోంటే…ఆ బాణాలను కృష్ణుడు తట్టుకోలేక దుర్భర వేదనకు లోనయ్యాడు. కృష్ణుడి పరిస్థితే అలా ఉంటే అర్జునుని సంగతి మరి చెప్పనవసరం లేదు. భీష్ముని బాణాలను ఎదుర్కొనలేక అర్జునుడు అచేతన మయిపోయాడు. ఇక పాండవ సైన్యం…తలో దిక్కుగా పరుగుదీస్తోంది. భీష్మునితో పోరాటం ఎవరి వల్లా కాదనిపించిన మరుక్షణం గాయాల బాధను పక్కనపెట్టి-‘చూస్తోంటే…భీష్ముడు ఈ రాజ్యం సమస్తాన్ని ఆ దుర్యోధనునికి కట్టబెట్టేలా ఉన్నాడు. అలా జరగడానికి వీల్లేదు. భీష్ముణ్ణి సంహరించి తీరాలి. ఆ తర్వాత పదకొండు అక్షౌహిణుల కౌరవ సైన్యాన్ని కూడా నిర్మూలించి వారి సామ్రాజ్య లక్ష్మిని పాండవుల పరం చెయ్యకపోతే ధర్మం నిలబడదు! ధర్మం కోసం నేను కూడా ఈ యుద్ధం చేయక తప్పదు’ అనుకున్నాడు కృష్ణుడు. అలా అనుకున్న మరుక్షణం చక్రాయుధాన్ని సంస్మరించి, దానిని చేజిక్కించుకుని రథం పైనుంచి భూతలి మీదకి లంఘించాడు. కృష్ణుని చరణాఘాతానికి ధరణీతలం వణికిపోయింది. పెద్దగా సింహనాదం చేశాడు కృష్ణుడు. ఆ నాదానికి కౌరవ యోధుల చెవులు చిల్లులుపడ్డాయి. భీష్ముని తేరిపారజూశాడు కృష్ణుడు. చూసి-

Leave A Reply