నాని ‘వి’ సినిమా తెలుగు రివ్యూ

0

చిత్రం:  వి
విడుద‌ల‌: అమెజాన్ ప్రైమ్‌
బ్యాన‌ర్‌: శ‌్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
న‌టీన‌టులు:   నాని, సుధీర్‌బాబు, నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి, సీనియ‌ర్ న‌రేశ్‌, రోహిణి, హ‌రీశ్ ఉత్త‌మ‌న్‌, మ‌ధుసూద‌న్ రావు, వెన్నెల‌కిషోర్ త‌దితరులు
సంగీతం:  అమిత్ త్రివేది
నేప‌థ్య సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
సౌండ్ డిజైన్‌:  బిశ్వ‌దీప్ చ‌ట‌ర్జీ
కెమెరా:  పి.జి.విందా
నిర్మాత‌లు:  దిల్‌రాజు, శిరీశ్, హ‌ర్షిత్ రెడ్డి
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి

క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు దెబ్బ‌తిన్న రంగాల్లో చిత్ర ప‌రిశ్ర‌మ ముందు వ‌రులో ఉంది. లాక్‌డౌన్ స‌మయంలో థియేట‌ర్స్ మూతప‌డ్డాయి. షూటింగ్స్ ఆగిపోయాయి. ఇప్పుడు షూటింగ్స్‌కు ప‌రిమితుల‌తో కూడిన అనుముతులున్నా, థియేట‌ర్స్‌ను ఓపెన్ చేసే విష‌యంలో మాత్రం కేంద్ర ప్ర‌భుత్వం ఒప్పుకోవ‌డం లేదు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు థియేట్స్ ఓపెన్ అయితే చూద్దామని వెయిట్ చేసిన చిన్న చిత‌కా సినిమాలు, ఒక‌ట్రెండు ఓ మోస్త‌రు సినిమాలకు డిజిట‌ల్ మాధ్య‌మ‌మే సాధ‌నంగా మారింది. త‌మ సినిమాలు ప్రేక్ష‌కుల‌ను రీచ్ కావ‌డం మిన‌హా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మేక‌ర్స్ మరేం చేయ‌లేని ప‌రిస్థితి ఈ క్ర‌మంలో విడుద‌లైన ఒక‌ట్రెండు సినిమాలు ప్రేక్ష‌కుల‌ను నిరాశ‌ప‌రిచిన‌వే. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్‌లో కాస్త హైప్ ఉన్న సినిమాగా పేరున్న ‘వి’ చిత్రాన్ని డిజిట‌ల్‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ముందుకు వ‌చ్చారు.  ఓర‌కంగా నాని, సుదీర్, నివేదా థామస్, అదితిరావు హైదరి ఇలా కాస్త పేరున్న స్టార్స్ న‌టించిన చిత్రం ‘వి’ కావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ వంటి అంశాలు కూడా సినిమాపై ఆసక్తిని పెంచడంలో తమదైన పాత్రను పోషించాయి. ఇక నాని నటించిన 25వ చిత్రం కావడంతో పాటు.. నాని నెగటివ్ షేడ్ చేస్తున్నాడనే ప్రచారం కూడా హైప్ క్రియేట్ చేయడంలో కీలకంగా మారింది. మరి ఈ అంచనాలను సినిమా అందుకుందా?  నానికి త‌న 25వ సినిమా ఎలాంటి విజ‌యాన్ని అందించింది?  అనే విష‌యాలు తెలుసుకోవాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం…

క‌థ‌:

హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో సాధిక్‌, చంద‌న్ అనే రెంగు గ్యాంగుల మ‌ధ్య పెద్ద గొడ‌వ జ‌రుగుతుంది. ఆ గొడ‌వ కాస్త హింసాత్మ‌కంగా మారుతుంటుంది. ఆ స‌మ‌యంలో డి.సి.పి ఆదిత్య‌(సుధీర్‌బాబు) రంగంలోకి దిగి అల్ల‌రి మూక‌ల‌ను ధైర్యంగా ఎదుర్కొంటాడు. గొడవ‌లో సాధిక్‌ను చంపేసిన చంద‌న్‌ను అరెస్ట్ చేయ‌డంతో కేసు క్లోజ్ అవుతుంది. అప్ప‌టి నుండి క్ర‌మ క్ర‌మంగా ఆదిత్య సిటీలో జ‌రిగే దౌర్జ‌న్యాల‌ను అరిక‌డుతూ అంద‌రి చేత సూప‌ర్ కాప్ అనిపించుకోవ‌డ‌మే ప‌తాకాల‌ను కూడా అందుకుంటాడు. అదే స‌మ‌యంలో సైకాల‌జీలో డిగ్రీ తీసుకున్న అపూర్వ రామానుజం(నివేదా థామ‌స్‌) ఆదిత్య క్యారెక్ట‌ర్‌ను బేస్ చేసుకుని ఓ క్రైమ్ న‌వ‌ల‌ను రాయాల‌నుకుని అత‌నితో పరిచ‌యం పెంచుకుంటుంది. ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారుతుంది. ఈ నేప‌థ్యంలో లంగ‌ర్ హౌస్ ఎస్సై వేద ప్ర‌సాద్‌ను ఎవ‌రో దారుణంగా హ‌త్య చేస్తారు. హ‌త్య చేయ‌డమే కాదు.. వీలైతే నన్ను ప‌ట్టుకో అంటూ డీసీపీ ఆదిత్య‌కు ఛాలెంజ్ విసురుతాడు సదరు కిల్లర్. త‌న‌కు ఛాలెంజ్ విసిరిన క్రిమిన‌ల్ ప‌ట్టుకోవ‌డానికి ఆదిత్య రంగంలోకి దిగుతాడు. ఆధారాలు సేక‌రించి వాటిని అధ్య‌య‌నం చేసే స‌మ‌యంలోనే కిల్ల‌ర్(నాని)… సిటీలోని ప్ర‌ముఖ బిల్డ‌ర్ మ‌ల్లిఖార్జున్‌(మ‌ధుసూద‌న్‌)ను హ‌త్య చేస్తాడు. రెండో హ‌త్య త‌ర్వాత డైరెక్ట్‌గా ఆదిత్య‌కు ఫోన్ చేసిన కిల్ల‌ర్ ఓ క్లూ కూడా ఇస్తాడు. ఆ క్లూను ఛేదించి ముంబై వెళ‌తాడు ఆదిత్య‌.
ఆదిత్య అక్క‌డ వెళ్లే లోపు కె.కె అనే ఓ డాన్‌ను చంపేస్తాడు కిల్ల‌ర్‌. కిల్లర్‌ను పట్టుకోవడానికి ఆదిత్య ప్రయత్నం చేస్తాడు.కానీ చివ‌ర‌కు కిల్ల‌ర్ త‌ప్పించుకుంటాడు. అదే సమయంలో ఆదిత్య‌కు కిల్ల‌ర్ ఓ క్లూ ఇస్తాడు. ఆ క్లూ ఆధారంగా ముందుకెళ్లి ఆదిత్య‌కు విష్ణు అనే చిన్న‌నాటి స్నేహితుడు గురించి తెలుసుకునే అవ‌కాశం క‌లుగుతుంది. ఇంతకూ ఆ స్నేహితుడు ఎవరు? అస‌లు విష్ణు ఎవ‌రు?  విష్ణుకి, కిల్ల‌ర్‌కు ఉన్న సంబంధమేంటి? అస‌లు కిల్ల‌ర్ హ‌త్య‌లు చేయ‌డానికి కార‌ణ‌మేంటి? చ‌నిపోయేవాళ్లు ఎవ‌రు?  చివ‌ర‌కు ఆదిత్య‌, స‌ద‌రు కిల్ల‌ర్‌ను ప‌ట్టుకుంటాడా?  అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

స‌మీక్ష‌:

నాని 25వ చిత్రంగా రూపొందిన ‘వి’లో ప్ర‌ధానంగా రెండు పాత్ర‌లు క‌నిపిస్తాయి. మిగిలిన పాత్ర‌ల‌న్నీ స‌పోర్టింగ్ రోల్స్ అనే చెప్పాలి. ఆ పాత్ర‌లే నాని పోషించిన రాక్ష‌సుడులాంటి నెగ‌టివ్ షేడ్ ఉన్న‌ పాత్ర‌.. సుధీర్ పోషించిన పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌. సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌కు ఛాలెంజ్ విసిరే తెలివైన కిల్ల‌ర్‌. హ‌త్య‌లు చేసేది నాని కావ‌డంతో అస‌లు ఈ హ‌త్య‌లు వెనుక మోటివ్ ఉంద‌నే విష‌యం మ‌న‌కు అర్థ‌మ‌వుతూనే ఉంటుంది. కానీ ఆ కార‌ణ‌మేంట‌నే విష‌యాన్ని ముందుగానే ఎక్క‌డా రివీల్ చేయ‌కుండా సినిమా ముగియ‌డానికి అర్థగంట ముందు రివీల్ అయ్యేలా ద‌ర్శ‌కుడు ఇంద్రగంటి మోహ‌న‌కృష్ణ క‌థ‌ను ముందుకు నడిపారు. ఇక సినిమాలో సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా సుధీర్ న‌ట‌న చాలా బావుంది. ఇక లుక్ ప‌రంగా సుధీర్ పడ్డ క‌ష్టాన్ని డైరెక్ట‌ర్ తొలి ఫైట్‌తో తెర‌పై ఆవిష్క‌రించాడు. ఇక నాని పాత్ర గురించి చెప్పాలంటే ‘వి’ నాని 25వ సినిమా.. అది కూడా నెగటివ్ షేడ్ అనేలా సాగే పాజిటివ్ పాత్ర. అయితే సినిమా విడుదల దర్శకుడు సస్పెన్స్‌ను ముందుకు నపడంలో సక్సెస్ అయ్యారు. ఇక సినిమాలో సుధీర్ ల‌వ‌ర్‌గా న‌టించిన నివేదా థామ‌స్ న‌ట‌న పరంగా పాత్ర‌లో ఇమిడిపోయే ప్ర‌య‌త్నం చేసింది. రోహిణి, వెన్నెల కిషోర్‌, హ‌రీశ్ ఉత్త‌మున్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.
సాంకేతికంగా చూస్తే ద‌ర్శ‌కుడు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి సినిమాను గ్రిప్పింగ్‌గా న‌డిపించ‌డానికి చేసిన ప్ర‌య‌త్నాల్లో తొలి స‌గ‌భాగం వ‌ర‌కు ఓకే అనొచ్చు. అయితే ఎప్పుడైతే సుధీర్‌.. నాని వెంట‌ప‌డ‌టం.. అక్క‌డ నుండి సుధీర్ బాబుకు నానినే క్లూ ఇవ్వ‌డం అనే పార్ట్ నుండి సినిమా గ్రిప్పింగ్‌గా అనిపించ‌లేదు. ఇక నాని చేసిన ఆర్మీ మేజ‌ర్ పాత్ర ఏదో తూతూ మంత్రంగానే చూపించారు..ఈ ఎపిసోడ్‌లో డెప్త్ క‌న‌ప‌డ‌దు. అలాగే నాని, అదితిరావు హైద‌రి మ‌ధ్య ఉన్న ల‌వ్ ట్రాక్ గొప్ప‌గా ఏం లేదు. అమిత్ త్రివేది సంగీతం అందించిన పాట‌ల‌న్నీ సంద‌ర్భానుచితంగా ఉన్నాయి. ఇక త‌మ‌న్ బ్యాగ్రౌండ్ స్కోర్, బిశ్వ‌దీప్ చ‌ట‌ర్జీ
సౌండ్ డిజైనింగ్ అన్నీ చ‌క్క‌గా కుదిరాయి. పి.జి.విందా సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ఏ ప‌ని చేసినా ఎంట‌ర్‌టైనింగ్‌గా చేయాల‌నేది నా పాల‌సీ .. స‌హా కొన్ని డైలాగ్స్ ఆక‌ట్ట‌కున్నాయి. ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి సెకండాఫ్ విష‌యంలో ట్రీట్‌మెంట్ తీసుకుని ఉండుంటే ఇంకా బావుండేద‌నిపించింది. నాని పాత్ర‌ను హైలైట్ చేయ‌డానికి మిగిలిన పాత్ర‌ల‌ను వీక్ చేసిన‌ట్లు భావ‌న క‌లిగింది.

క్యాట్ అండ్ మౌస్ అనే రేంజ్‌లో ఉండాల్సిన సినిమా తుది అర్థగంటలో మారిపోతుంది. అదితిరావు హైదరి పాత్రను అసలు రిలీజ్ ముందు వరకు ఎక్కడా రివీల్ చేయలేదు. ఆమె పాత్రను మంచిని కాపాడటానికి చనిపోతుంది అయితే అందుకు తగ్గట్టు ఆమె పాత్ర స్వభావాన్ని ఎక్కడా ఎలివేట్ చేయలేదు.
నాని, ఇంద్రగంటి కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ మూవీ. అష్టాచమ్మా, జెంటిల్ మన్ చిత్రాల తరహాలో ఇది ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే.. ఓటీటీలో తమ సినిమాలను విడుదల చేయడానికి సంకోచిస్తున్న మిగతా స్టార్స్ వి సినిమా తర్వాత తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు వి సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మిగతావారు ఆలోచనలో పడతారనడంలో సందేహం లేదు.

బోట‌మ్ లైన్:  నాని ‘వి’లనిజం ఓ సారి చూడొచ్చు

రేటింగ్:  2.5/5

Leave A Reply