ఆఖరి ఓవర్ నోరూరింది: హార్దిక్‌ పాండ్య

0

ఆఖరి ఓవర్‌ స్పిన్నర్‌ వేయడం లీగు చరిత్రలో 18వ సారి

ముంబయి ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్‌ను స్పిన్నర్‌ కృష్ణప్ప గౌతమ్‌తో కేఎల్‌ రాహుల్‌ వేయించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటికే పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్య విధ్వంసకరంగా ఆడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో 20వ ఓవర్లో బంతిని స్పిన్నర్‌ చేతికి అప్పగించడం అభిమానులు, విశ్లేషకులను విస్మయానికి గురిచేసింది. అయితే పాండ్యకు మాత్రం నోరూరిందట!

వాస్తవంగా ముంబయి 14 ఓవర్లకు 87/3తో కష్టాల్లో ఉంది. గెలవాలంటే భారీ లక్ష్యం నిర్దేశించాల్సిన పరిస్థితి. దాంతో కీరన్‌ పొలార్డ్‌ (47*; 20 బంతుల్లో 3×4, 4×6), హార్దిక్‌ (30*; 11 బంతుల్లో 3×4, 2×6) దంచికొట్టడం మొదలు పెట్టారు. 19 ఓవర్లకు 166/4తో నిలిపారు. అలాంటప్పుడు ఆఖరి ఓవర్‌ను ఆఫ్‌స్పిన్నర్‌ గౌతమ్‌కు ఇవ్వడం పంజాబ్‌కు చేటు చేసింది. రెండో బంతిని పాండ్య సిక్సర్‌గా మలిచాడు. ఇక ఆఖరి మూడు బంతుల్ని పొలార్డ్‌ స్టేడియం దాటించాడు. ఐదో బంతికి అతడు 97 మీటర్ల సిక్స్‌ బాదేయడం గమనార్హం. ఈ ఓవర్లో 25 పరుగులు రావడంతో ప్రత్యర్థికి ముంబయి 192 పరుగుల లక్ష్యం నిర్దేశించింది.

ఆఖరి ఓవర్‌ కోసం బంతిని కృష్ణప్ప గౌతమ్‌కు అప్పగించగానే తమకు నోరు ఊరినట్టు అనిపించిందని పాండ్య అన్నాడు. నిజానికి తాము ఆక్షణంలో పరుగులు చేసేందుకు తహతహలాడుతున్నామని వివరించాడు. ఆఫ్‌ స్పిన్నర్‌ అని తెలియగానే పొలార్డ్‌, తాను దంచికొట్టాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు. తాను ఒక్క సిక్సరే కొట్టినా పొలార్డ్‌ మూడు సిక్సర్లు దంచి భారీ స్కోరును అందించాడని ప్రశంసించాడు. కాగా లీగు చరిత్రలో తొలి ఇన్నింగ్స్‌లో 20వ ఓవర్‌ను స్పిన్నర్‌ వేయడం ఇది 18వ సారి. చివరిసారిగా 2014లో వేయడం గమనార్హం.

Leave A Reply