లిప్‌లాక్‌ గ్రాఫిక్స్‌ అని చెప్తే నమ్మలేదు: కాజల్

0

హైదరాబాద్‌: తెరపై అందచందాలతో పాటు, అభినయాన్ని చక్కగా ఒలికించే ముద్దుగుమ్మ కాజల్‌. 50కి పైగా సినిమాల్లో నటించిన కాజల్‌ లిప్‌లాక్‌ సన్నివేశాలతోనూ ప్రేక్షకుల్ని మురిపించింది. కాజల్‌ లిప్‌లాక్‌ అందుకున్న వాళ్లలో తమిళ స్టార్‌ హీరో సూర్య ఒకరు. వీళ్లిద్దరూ కలిసి కె.వి.ఆనంద్‌ దర్శకత్వంలో ‘బ్రదర్స్‌’ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. సూర్య ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రానికి అటు తమిళ్‌లో ఇటు తెలుగులో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. ఈ సినిమాలో సూర్యకు కాజల్‌కు మధ్య థియేటర్లో ఓ చక్కటి లిప్‌లాక్‌ సీన్‌ వస్తుంది. అయితే ఈ సన్నివేశానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని తాజాగా బయటపెట్టింది కాజల్‌. నిజానికి ఆ సన్నివేశంలో కాజల్‌ను సూర్య అసలు ముద్దే పెట్టుకోలేదట. అది గ్రాఫిక్స్‌తో చూపించిన లిప్‌లాక్‌ అట.

‘‘ఆ సీన్‌ చేసే సమయానికి సూర్యకు కానీ, నాకు కానీ అలా ముద్దు పెట్టుకోవాలని లేదు. ముఖ్యంగా సూర్య చాలా ఇబ్బందిగా ఫీల్‌ అయ్యారు. ఆ సీన్‌ సినిమానికి చాలా ముఖ్యమైనది. అందుకే ఆనంద్‌ మా ఇద్దరి మధ్య ఆ సీన్‌ ఓ గమ్మత్తైన పద్ధతిలో తెరకెక్కించారు. బ్లూ మ్యాట్‌ ముందు సూర్యను కుర్చీలో కూర్చోపెట్టి పక్కకు తిరిగి ఓ గ్లాస్‌పై ముద్దుపెట్టించి దాన్ని చిత్రీకరించారు. తర్వాత నాకు ఎదురుగా బ్లూమ్యాట్‌తో తయారు చేసిన ఓ బొమ్మను పెట్టి దానికి ముద్దు పెట్టించారు. అలా మా రెండు సీన్లను గ్రాఫిక్స్‌లో ఒక్కటి చేసి లిప్‌లాక్‌లా చూపించారు. థియేటర్లో ఆ సీన్‌ చూసిన ప్రతిఒక్కరూ ఇది గ్రాఫిక్స్‌ అని చెప్తే నమ్మలేరు. అంత సహజంగా ఆ సన్నివేశాన్ని తెరపై ఆవిష్కరించారు దర్శకుడు ఆనంద్‌’’ అంటూ నాటి లిప్‌లాక్‌ సీన్‌ రహస్యాన్ని లీక్‌ చేసింది చందమామ.

Leave A Reply