క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య చేతిలో చిట్టి పాండ్య

0

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియా ఆల్‌రౌండర్‌, ముంబయి ఇండియన్స్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య తండ్రయ్యాడు. గురువారం తన ప్రేయసి నటాషా స్టాంకోవిచ్‌ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని హార్దిక్‌ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తూ.. చిట్టి పాండ్య చేతిని పట్టుకున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఏడాది కొత్త సంవత్సరం సందర్భంగా తన ఎంగేజ్‌మెంట్‌ ఫొటోను పాండ్య సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. త్వరలోనే పెళ్లి అనుకుంటున్న సమయంలో… తన ప్రేయసి గర్భవతి అంటూ ఇటీవల మరికొన్ని ఫొటోలు పోస్టు చేశాడు. ఈ రోజు తండ్రి అయ్యానంటూ… తన బిడ్డతో దిగిన  ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.

గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత ఇంగ్లాండ్‌లో వెన్నునొప్పికి శస్త్రచికిత్స చేయించుకున్న హార్దిక్‌ పాండ్య కొద్ది నెలలపాటు ఆటకు దూరమయ్యాడు. ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌ పర్యటనకు అందుబాటులో ఉంటాడనుకున్నా పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించలేదు. దీంతో టీమిండియా ఆ పర్యటనకు పాండ్యను దూరం పెట్టింది. అనంతరం కోహ్లీ సేన స్వదేశానికి తిరిగొచ్చాక సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించడంతో ఆటలన్నీ నిలిచిపోయాయి. ఐపీఎల్‌ వాయిదా పడింది. దాంతో పాండ్య తన కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్నాడు. లాక్‌డౌన్‌ వేళ తానేం చేస్తున్నాననే విషయాలను కూడా అప్పుడప్పుడూ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించాడు.

Leave A Reply