మృగాళ్ల వేటాను తట్టుకోలేక..ప్రాణాలు వదిలిన దళిత యువతి

0

దిల్లీ: ఆమె.. మనిషి రూపంలో కొన్ని మృగాళ్లు తిరుగుతుంటాయని గ్రహించలేకపోయింది. దగ్గర్లోనే తన కుటుంబం ఉండగా తనకేం భయం అనుకుంది. అందుకే ఒంటరిగా తన పని తాను చేసుకుపోయింది. కానీ, మాటువేసిన మృగాళ్ల గురించి తెలుసుకోలేక, తనపై జరగబోయే దాడిని పసిగట్టలేకపోయింది. అందుకే అ నలుగురి కర్కశ వేటలో గాయపడి.. కోలుకోలేక కన్నుమూసింది. ఇదంతా ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌ గ్రామంలో ఓ 20 ఏళ్ల యువతికి జరిగిన ఘోర అన్యాయం.

రెండు వారాల క్రితం దిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలోని హాథ్రస్‌ గ్రామంలో ఓ దళిత యువతిపై ఉన్నతవర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఆమెను తీవ్రంగా హింసించి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అది చాలక ఏ మాత్రం జాలి లేకుండా ఆమె నాలుకను కూడా కోశారు. తీవ్రంగా గాయపడిన ఆమె దిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణానికి ఒడిగట్టిన వారు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. అది కూడా ప్రజాగ్రహం పెల్లుబికిన తరవాతే పోలీసులు నిందితులను అరెస్టు చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.

మృతురాలి సోదరుడు మీడియాతో మాట్లాడుతూ..‘ఆ రోజు మా అమ్మ, సోదరి, సోదరుడు పొలంలో గడ్డి కోయడానికి వెళ్లారు. తరవాత మా అన్న కొంచెం ముందుగానే ఇంటికి వచ్చేసినా, వారు ఇంకా పొలంలోనే ఉండిపోయారు. నా సోదరి మాత్రం కొంచెం దూరంగా ఉండి పనిచేసుకుంటుంది.ఆమె వెనక నుంచి నలుగురైదుగురు వ్యక్తులు ఒక్కసారిగా దాడి చేసి ఆమె చున్నీని మెడకు చుట్టేసి, దగ్గర్లోని పొలంలోకి లాక్కుపోయారు. కొద్దిసేపటి తరవాత మా అమ్మ ఆ విషయాన్ని గుర్తించింది. తన కోసం వెతగ్గా తీవ్రంగా గాయాలపాలైన స్థితిలో కనిపించింది. అత్యాచారానికి గురైందని గ్రహించడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాం. కానీ నాలుగైదు రోజుల తరవాత వారిపై చర్య తీసుకున్నారు’ అని మీడియాకు వెల్లడించారు. అయితే  ఈ ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు.

Leave A Reply