జనవరినాటికి కోవిడ్-19 వ్యాక్సిన్ : ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా

0

న్యూఢిల్లీ : ఆంక్షల నుంచి దూరంగా, స్వేచ్ఛగా సంచరించాలని ప్రపంచమంతా ఎంతగానో ఎదురు చూస్తోంది. కోవిడ్ మహమ్మారి సృష్టిస్తున్న భయోత్పాతం నుంచి బయటపడే మార్గాలను అన్వేషిస్తోంది. అటువంటి సమయంలో ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఓ మంచి వార్త చెప్పారు. వచ్చే జనవరినాటికి కోవిడ్-19 వ్యాక్సిన్ వస్తుందన్నారు. అయితే వ్యాక్సిన్ పంపిణీలో కొన్ని సవాళ్లు కూడా ఉంటాయన్నారు.

‘ఇండియా టుడే’ హెల్త్‌గిరి అవార్డ్స్, 2020 సందర్భంగా డాక్టర్ గులేరియా శుక్రవారం మాట్లాడారు. మన దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో చెప్పడం కష్టమని చెప్పారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడమనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రయోగాలు, కోవిడ్-19 ఇన్ఫెక్షన్స్‌ నిరోధంలో వ్యాక్సిన్ సమర్థత వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు.

అంతా అనుకున్నట్లుగానే జరిగితే వచ్చే ఏడాది ప్రారంభం నాటికి వ్యాక్సిన్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే ప్రారంభంలో దేశ జనాభా మొత్తానికి అవసరమైనంత మోతాదులో వ్యాక్సిన్ అందుబాటులోకి రాదని తెలిపారు.

వ్యాక్సిన్ సిద్ధమైతే దానిని ఉత్పత్తి చేయడం, పంపిణీ చేయడం మరొక సవాలు అని చెప్పారు. వ్యాక్సిన్ ఎవరికి ముందుగా ఇవ్వాలనే విషయంపై చర్చలు ప్రారంభమైనట్లు తెలిపారు. అపాయం ఎక్కువగా ఉన్నవారికి ముందుగా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వైద్య, ఆరోగ్య రంగంలో పని చేసేవారికి, కరోనా యోధులను ఒక వర్గంగానూ, ప్రాణాపాయంగలవారిని మరొక వర్గంగానూ విభజించి, వీరికి వ్యాక్సిన్ ముందుగా ఇవ్వడంపై సమాలోచన జరుగుతున్నట్లు చెప్పారు.

వ్యాక్సిన్ ఇవ్వడంలో ప్రాధాన్యతా క్రమాన్ని పాటించకపోతే మరణాల సంఖ్య పెరుగుతుందని, ఈ మహమ్మారి వ్యాపిస్తూనే ఉంటుందని తెలిపారు

Leave A Reply