తెలంగాణలో ఏటీఎం చోరీలకు ఏ మాత్రం బ్రేకులు పడటం లేదు. వరుసగా ఏదో ఒక చోట దొంగల ముఠా దోపిడీలకు పాల్పడుతూనే ఉంది. కొంత కాలంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దొంగతనాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నల్లగొండ జిల్లాలోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. అనపర్తి పోలీస్ బెటాలియన్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంలో దొంగలు పడ్డారు. శనివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చోరీ విషయం బ్యాంకు సిబ్బంది పోలీసులకు చేరవేయడంతో వారు వచ్చి సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి లోపలికి చొరబడ్డారు. కొంతసేపటికి దాని వైర్లు కట్ చేసి గ్యాస్ కట్టర్ సాయంతో మిషన్ కట్ చేశారు. అందులో ఉన్న రూ. 11.55 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. సెటర్ వేసి ఉండటంతో అటు వైపు ఎవరూ వెళ్లలేదు. సోమవారం బ్యాంకు సిబ్బంది దాన్ని తెరిచే సరికి దొంగతనం విషయం బయటపడింది. పోలీసు బెటాలియన్ పక్కనే ఇలా జరగడంతో గాలింపు ముమ్మరం చేశారు. కొంత కాలంగా ఏటీఎంలే లక్ష్యంగా జరుగుతుండటంతో ఒకే ముఠా వరుస దొంగతనాలు చేస్తున్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.